Nayanthara | నయనతారని అభిమానులు ‘లేడీ సూపర్‌స్టార్’ అని ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు. నిజానికి శిఖరాగ్రాన ఉంటే కానీ ‘సూపర్‌స్టార్’ బిరుదు నటులకు రాదు. మరి ఆ బిరుదు నయన్‌ని వరించిందంటే.. తను అగ్రస్థానంలో ఉన్నట్టేకదా. దానికి తగ్గట్టే పారితోషికం విషయంలోనూ తోటి హీరోయిన్లకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు నయనతార. ఇప్పుడిదంతా దేనికి? అంటే.. అంతటి స్టార్డమ్ ఉన్న నయనతార కెరీర్.. భయంకరమైన అవమానంతో మొదలయ్యిందట.
ఆ విషయాన్ని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘హీరో పార్ధీబన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాతో నేను హీరోయిన్గా పరిచయం కావాల్సింది. ఆడిషన్ చేసి మరీ ఆయన నన్ను కథానాయికగా తీసుకున్నారు. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టైమ్‌కి లొకేషన్లో ఉండలేకపోయాను. తొలిరోజే లేట్‌గా రావడంతో ‘ఈ సినిమాకు నీతో పనిలేదు.. వెళ్లిపో..’ అని ముఖంమీదే అనేశారు పార్ధీబన్.
అందరిముందూ ఆయన అలా అనడంతో మనసు చివుక్కుమంది. క్షమించమని ఆడిగే ధైర్యం కూడా చేయలేకపోయా. తల దించుకొని వెనక్కి వెళ్లిపోయా.’ అంటూ గత చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు నయనతార. ఆ తర్వాత హరి దర్శకత్వంలో శరత్‌కుమార్ హీరోగా రూపొందిన ‘అయ్యా’ చిత్రం ద్వారా నయన్ తమిళతెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.