“మాయ’ సినిమా తరువాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నా. ‘సర్కిల్’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా వుంది’ అన్నారు దర్శకుడు నీలకంఠ. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కిల్’. సాయిరోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. ఈ నెల 7న విడుదలకానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ‘సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమా ఇది. విధి ఓ వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందనేది మెయిన్ థీమ్‌గా తీసుకున్నాం. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. కొరియోగ్రాఫర్‌గా అందరికి తెలిసిన బాబా భాస్కర్ గారి పాత్ర ఈ చిత్రంలో ఎవరూ ఊహించని విధంగా వుంటుంది. విలన్‌గా ఈ చిత్రంలో ఆయన నటన అందరిని ఆకట్టుకుంటుంది. హీరో వెంకటేష్‌తో స్వామి వివేకానంద సిరీస్ ప్లాన్ చేశాం. అయితే అది టేకాఫ్ కాలేదు. త్వరలో ఓ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నా’ అన్నారు.