సమకాలీన సినిమా మొత్తం వ్యాపారాత్మకంగా మారిపోయిందని, ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో కథాంశాల్లో నాణ్యత కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్‌లైఫ్’ జూన్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమా కలెక్షన్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలను ఎందుకు చేయలేకపోతున్నాం? అని ఓ విలేకరి ప్రశ్నకు మణిరత్నం సమాధానమిచ్చారు.
భారీ కలెక్షన్స్ ముఖ్యమా? లేదా హృదయాన్ని తడిమే భావోద్వేగాలు కలిగిన కథలు ముఖ్యమా? అని ప్రేక్షకులు విశ్లేషించుకోవాలి. ఒకప్పుడు సినిమాలు విడుదలైతే దాని కంటెంట్, టేకింగ్ గురించి చర్చించుకునేవారు. ఇప్పటి సినిమాల్లో ఏవో కొన్ని అంశాలు మాత్రమే ప్రేక్షకుల్ని ఎగ్జయిట్ చేస్తున్నాయి. ఏదిఏమైనా కేవలం వసూళ్లను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు’ అని మణిరత్నం అన్నారు. ‘నాయకన్’ (1987) తర్వాత మణిరత్నం-కమల్‌హాసన్ కాంబోలో వస్తున్న ‘థగ్‌లైఫ్’ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.