నోటి దురుసు వీపుకి చేటు అనే నానుడి కొందరు సెలబ్రిటీల విషయంలో నిజమవుతూవుంటుంది. ఇటీవల ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ ఓ కార్యక్రమంలో పాల్గొని, దీపిక పదుకోన్ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. దాంతో ఆయన దానికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. దీపిక గురించి ఆయన మాట్లాడుతూ ‘2012లో దీపిక నటించిన ‘కాక్టైల్’ చిత్రానికి నేను రైటర్ని. ఆ టైమ్‌లోనే తనతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాను. బయట సాఫ్ట్‌గా కనిపించే దీపికలో అల్లరి కోణాన్ని చూసి షాక్ అయ్యాను.
బయట కనిపించే దీపిక ఇమేజ్ ఒక ముసుగు మాత్రమే. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఆమెలోని అసలు కోణాలను అర్థం చేసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నేరుగా దీపిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ కొన్ని మీడియాల్లో వార్తా కథనాలు వెలువడటంతో ఇంతియాజ్ నాలుక కరుచుకొని వివరణ ఇచ్చారు. అవి సరదాగా చేసిన వ్యాఖ్యలని ఆయన స్పష్టం చేశారు. దీపిక తన స్నేహితురాలని, తను తప్పుగా అర్థం చేసుకోదని తనకు తెలుసని, కానీ ఇతరులు చెప్పిన దాన్ని విని బాధపడే అవకాశం ఉందనే వివరణ ఇస్తున్నానని ఇంతియాజ్ అన్నారు.