మన కష్టాలు వినేందుకు దోస్తులున్నారు. ఆకలితో ఉంటే కడుపు నింపేందుకు కావాల్సినంత ఆధారముంది. ఏమీలేనీ మూగజీవాలకు ఎవరున్నారు మరీ. అలాంటి వాటికోసం నేనున్నాను అని ముందుకొచ్చింది ఓ మహిళ. గాయాలతో విలవిల్లాడే కుక్కపిల్లలను చంకనేసుకొని వైద్యమందించి, ఆకలి తీరిస్తూ అమ్మగా మారింది ఖమ్మం పట్టణానికి చెందిన మేకల పద్మ. నిలువెత్తు స్వార్థంతో ఉన్న మనుషుల మధ్య కుక్కల కోసం ఉద్యోగాన్నే వదిలేసింది. వాటికోసం ఆశ్రమాన్ని నెలకొల్పి , మూగజీవుల ఆలనాపాలనా చూస్తూంది. భౌ..భౌ.. అంటూ అవి అరిచే అరుపులు తనకు ముద్దుముద్దు పిలుపుల్లా వినిపిస్తాయని అంటున్న ‘నేచర్ యానిమల్ కేర్ సెంటర్’ వ్యవస్థాపకురాలు పద్మ జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు తన మాటల్లోనే..
తల్లిదండ్రులు ఏం పనులు చేస్తే పిల్లలు వాటిని ఆచరిస్తారంటారు కదా! నా విషయంలో అదే జరిగింది. మా నాన్న చేసిన మంచిని నేను కొనసాగిస్తే, నేను చేసే సేవకు నా బిడ్డలు అండగా నిలుస్తున్నారు. మా నాన్న పేరు కొమురయ్య. ఆనాథలు, మూగ జీవాలకు తిండి ఆప్యాయంగా పెట్టేవారు. వాటిని చూస్తూ పెరగడం వల్లే నాకు ఈ సేవా భావం అలవడింది. నాకు చిన్నతనంలోనే పెండ్లి చేశారు. మెడలో పుస్తెలు కట్టుకొని బడికి వెళ్లడం ఇష్టంలేక చదువు మానేశాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉండటం వల్ల మా అమ్మమ్మ కుట్టుమిషన్ కొనిచ్చింది. ఎవరి సహాయం లేకుండానే టైలరింగ్ నేర్చుకున్నాను. కొన్నేండ్లకు విద్య గొప్పతనం తెలిసి టీటీసీలో చేరి క్రాప్ట్ కోర్సు పూర్తి చేశాను.
ఆ తరువాత ఓపెన్ డిగ్రీ కూడా పూర్తిచేశాను. క్రాఫ్ట్ కోర్సు పూర్తి చేసిన తరవాత నా చుట్టుపక్కల ఉన్న ఒంటరి మహిళలకు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి తోడ్పాటునిచ్చేందుకు మా ఇంట్లోనే ఎంబ్రాయిడరీ, మగ్గం, టైలరింగ్ నేర్పించడం మొదలుపెట్టాను. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో బడిపిల్లల దుస్తులన్నీ మేమే కుట్టేవాళ్లం. నా దగ్గర నేర్చుకున్నవారు వేలల్లో ఉంటారు. పనైతే నేర్చుకున్నారు కానీ, వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా పోయింది. ఆ సమయంలోనే ఎస్బీఐ బ్యాంక్ శిక్షణనిస్తూ సర్టిఫికేట్లు ఇస్తుందని తెలిసి, మా వాళ్లు ఇదివరకే శిక్షణ తీసుకున్నారు వారికి సర్టిఫికేట్లు ఇవ్వండి అని బ్యాంక్ అధికారులను అడిగాను. అయితే వాళ్లు నిర్వహించే శిక్షణ తరగతుల్లో క్రాప్ట్ టీచర్‌గా చెబితేనే మా వాళ్లకు సర్టిఫికేట్లు ఇస్తామని మెలిక పెట్టారు. వెంటనే ఒప్పుకొని అందులో చేరాను. అదికూడా నా మంచికే జరిగింది. ఆ తరువాత ఎస్బీఐలోనే ఉద్యోగం సాధించి 2014 నుంచి 2022 వరకు ఉద్యోగం చేశాను.

ఉద్యోగం వదిలేశా
ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు శునకాలకు అన్నం పెట్టేదాన్ని. ఉదయం పూట ఇంట్లో వండిన భోజనాన్ని దారివెంట ఉండే శునకాలకు పంచుకుంటూ వెళ్లేదాన్ని. సాయంత్రం తిరిగొచ్చేటప్పుడు పాలు బిస్కెట్లు వేస్తూ వచ్చేదాన్ని. అంతా బాగుందన్న సమయంలో ఒక్కసారిగా ఖమ్మం నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ చేశారు. కొత్త ప్రాంతం కావడంతో ఇబ్బందిగా అనిపించింది. ఆఫీస్‌కెళ్లి పనిచేసినా నా ధ్యాసంతా ఖమ్మంలోని శునకాలపైనే ఉండేది. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యాను. ఖమ్మంలో అప్పటికే తిండిలేక కొన్ని కుక్కలు మృత్యువాతపడ్డాయని తెలిసింది.
ఇక నాకు అక్కడ ఉండటానికి మనసొప్పలేదు. వెంటనే ఉద్యోగం వదిలేసి ఖమ్మం తిరిగి వచ్చేశాను. తిరిగి ప్రతిరోజూ ఆ శునకాలకు తిండిపెడుతూ రోగాలు, గాయాల భారిన పడినవాటిని మా ఇంటికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించడం మొదలుపెట్టాను. మూడు గదుల మా ఇంట్లో పదుల సంఖ్యలో శునకాలు ఉండేవి. నా కూతురు పెండ్లప్పుడు, పెద్ద కొడుకు పెండ్లప్పుడు ఆ మూగ జీవాలకు ఇబ్బంది రాకుండా.. మరో ఇంటిని అద్దెకు తీసుకొని, అక్కడే పెండ్లి వేడుకలు జరిపించాను. కొన్నాళ్లకు కుక్కల సంఖ్య పెరగడంతో మరో ప్రాంతానికి మా మకాం మార్చాం. శునకాల కోసం ఎనిమిది పోర్షన్లు కిరాయికి తీసుకొని సంరక్షిస్తున్న సమయంలో వాటితో పాటు నాలుగు గుర్రాలు చేరాయి. అందులో ఒక గుర్రానికి పెద్దగాయమైతే రూ.70వేల వరకు ఖర్చుచేసినా అయినా కూడా అది బతకలేదు. ఆ తరువాత రెండు గుర్రాలను బయటికి ఇచ్చేసి. నాతో పాటు ఒక గుర్రాన్ని ఉంచుకుంటున్నాను.
పేర్లతో పిలుస్తా
ప్రమాదాలకు గురైన లేదా అనారోగ్యాల బారిన పడిన శునకాలను సేవలు చేస్తున్న తరుణంలో..‘అవి కుంటివి, గుడ్డివి, ఉదయం నిద్రలేచి వాటిని చూడటం వల్ల మేము అనారోగ్యాలకు గురవుతున్నాం’ అని స్థానికులు నసిగారు. దీంతో ఊరికి దూరంగా ఉన్న మా అన్నయ్య పొలంలోకి వాటితోపాటు వెళ్లిపోయాను. ఏడాదికి రూ.60 వేలు అద్దె చెల్లిస్తూ… రెండెకరాల ప్రాంగణంలో వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నాను. రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన శునకాలను చేరదీసి, వాటికి పూర్తిగా నయమయ్యేంత వరకు చికిత్స అందిస్తుంటాను. ప్రతి రోజూ ఉదయం 20కిలోల బియ్యం నానబెట్టి వంటకు సిద్ధం చేస్తాను.
ఉదయం ఏడు గంటల కల్లా భోజనంతోపాటు పెడిగ్రీ సిద్ధం చేస్తాను. ఎనిమిదింటికి అన్నటికీ వడ్డిస్తాను. అవసరమైన వాటికి ఇంజెక్షన్లు వేయడం, టానిక్‌లు పోయడంతో పాటు పెరాలసిస్ గురైన శునకాలకు డైపర్లు మార్చడం ఇలా రోజంతా వాటితోనే సాగిపోతుంది. మధ్యాహ్నం మూడింటికి మరోసారి భోజనం అందిస్తాను. మొదట్లో 18 శునకాలను చేరదీశాను. ఇప్పుడు వీటి సంఖ్య 200కు పైమాటే! అవి మా ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడే వాటికి పేర్లను పెడుతాను. ఆ పేర్లతోనే వాటిని పిలుస్తాను. పొలం కావడంతో పాముల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు పాముకాటుకు గురై పది కుక్కల వరకు మృతి చెందాయి. వాటికి సమాధి కట్టించి, మొక్కలు నాటాను. ఆ మొక్కల్లో చనిపోయిన జీవాలను చూసుకుంటున్నాను. సర్పాల నుంచి రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాను.
మానసిక ప్రశాంతత
ఈ మూగజీవాల కోసం నా సొంత ఇల్లు, వంటిమీద బంగారం అమ్మేశాను. సమాజంలో ఎన్నో మూగజీవులుండగా శునకాలపైనే మమత ఎందుకు అని అడిగితే నా వద్ద సమాధానం లేదు. కానీ, వాటికి సేవ చేయడం ద్వారా నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పటివరకు నా సేవను గుర్తించి ప్రభుత్వాలు పలు అవార్డులు అందించాయి. ఇటీవల కాలంలో ఖమ్మం కార్పొరేషన్ అధికారులు సైతం డాగ్స్ షెల్టర్కోసం జాగ ఇస్తానని మాటిచ్చారు. త్వరలో వస్తుందని ఆశిస్తున్నా. చాలామంది రోడ్లమీద వేగంగా వాహనాలు నడుపుతూ మూగజీవాలను బలి తీసుకుంటున్నారు. దయచేసి మానవత్వంతో మెలగండి మూగజీవుల రోదన అర్థం చేసుకొండి. ఇంట్లో పిల్లలు అరిస్తే ఎంత బాగుంటుందో నాకు కూడా వీటి అరుపులు అంతే ముద్దుగా అనిపిస్తాయి.
ఈ శునకాల పోషణకు ప్రస్తుతం నెలకు రూ.70 వేల ఖర్చొస్తున్నది. ఈ సేవలో నా ముగ్గురు పిల్లలు భాగమయ్యారు. పెద్దకొడుకు నెలకు రూ.20వేల విలువ చేసే పెడెగ్రీ ఇప్పిస్తాడు. కూతురు ఇంటి కిరాయి, మందులకయ్చే ఖర్చులను భరిస్తున్నది. చిన్నోడు పెరుగు, పాలు ఇప్పించడంతో పాటు నాతోపాటుగా వాటికి సపర్యలు చేస్తుంటాడు. ఎప్పుడూ వాటిగురించే ఆలోచిస్తుంటాడు. అప్పుడప్పుడు వాటికోసం పెండ్లి కూడా చేసుకోనని అంటుంటాడు.
రాజు పిల్లనగోయిన
బండారి మహేశ్, ఖమ్మం