ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆదిత్యహాసన్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. వైష్ణవి చైతన్య కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర కథానాయిక రష్మిక మందన్న క్లాప్‌నివ్వగా, శివాజీ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రిప్ట్నందించారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని, ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని, జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని మేకర్స్ తెలిపారు.
‘90s’ వెబ్‌సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ కథకు కొనసాగింపుగానే తాజా సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.