Diljit Dosanjh Met Gala 2025 | ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2025 ఈవెంట్లో భారతీయ నటులు సందడి చేసిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నటి కియారా అద్వానీతో పాటు పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ తొలిసారి కనిపించి అందరి దృష్టి ఆకర్షించారు. అయితే షారుఖ్ బ్లాక్ డ్రెస్‌లో అలరించగా.. కియారా బేబి బంప్స్‌తో దర్శనమిచ్చింది. ఇదిలావుంటే షారుక్ తర్వాత దిల్జిత్ దోసాంజ్ తన ఔట్ఫిట్తో అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రముఖ డిజైనర్ ప్రబాల్ గురుంగ్ స్పెషల్‌గా డిజైన్ చేసిన పంజాబీ పటియాలా మహారాజ్ ఔట్‌ఫిట్‌ను ధరించిన ఆయన మెట్ గాలాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. క్రీమ్ కలర్ కుర్తా, ముత్యాలు, రాళ్ల హారం, తలపాగా, చేతిలో తల్వార్‌తో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం మహాజారా స్టైల్లో చేతిలో తల్వార్ పట్టుకొని దిల్జిత్ రాజసంగా బ్లూ కార్పేట్‌పై నడిచారు.
అయితే ఈ వేడుకలో స్పెషల్‌గా కనిపించాలని దిల్జిత్ పటియాలా మహారాజుకి చెందిన వ్యక్తిగత ఆభరణాలు ధరించాలని అనుకున్నాడంటా.. ఈ అభరాణాల్లో అత్యంత విలువైన రూ.21 కోట్ల వజ్రపు హారాన్ని మెడలో వేసుకొని ఈవెంట్లో పాల్గోందామని దానిని అద్దె ప్రాతిపాదికన తీసుకుందామని దిల్జిత్ భావించాడు. కానీ ఈ వజ్రపు హారం ప్రస్తుతం మ్యూజియంలో సీల్ వేసి ఉండడంతో వాటిని ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అలాగే ఉన్న డిజైన్‌ను దిల్జీత్ చేయించుకున్నట్లు తెలుస్తుంది.
1928లో పటియాలా మహారాజు భూపీందర్ సింగ్ కోసం కార్టియర్ (Cartier) అనే ఫ్రెంచ్ ఆభరణాల సంస్థ 100 క్యారెట్ల వజ్రాలతో ఒక ప్రత్యేకమైన హారాన్ని తయారు చేసింది. ఇందులో 2,930 వజ్రాలు ఉన్నాయి, వాటిలో ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద పసుపు రంగు వజ్రం “డీ బీర్స్” కూడా ఉంది. ఈ నెక్లెస్ బరువు సుమారు 1,000 క్యారెట్లు. నేటి మార్కెట్ ప్రకారం దీని విలువ సుమారు రూ. 21 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే ఆ ఫ్రెంచ్ ఆభరణాల సంస్థ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత ఖరీదైన హారం ఇదేనట!