Dil Raju IT Officials | ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లతో పాటు అతడి కార్యాలయాల్లో ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు విచారణకు హాజరయ్యాడు దిల్ రాజు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణలో దిల్ రాజు గత ఏడాది నిర్మించిన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాలకు సంబంధించిన పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లను అధికారులకు అందించాడు. ఇక విచారణ అనంతరం దిల్ రాజు బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆయనని మళ్లీ విచారణకు పిలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన నిర్మించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడులయ్యాయి. దీంతో ఆయా సినిమాల నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐటీ దాడులకు సంబంధించి దిల్ రాజ్ స్పందిస్తూ.. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు చాలా సర్వసాధారణమని అన్నారు. తమ లావాదేవీలన్నీ క్లీన్గా క్లియర్గా ఉన్నాయని చెప్పారు. తమ వద్ద ఏ కోట్ల రూపాయల నగదు లభించలేదని స్పష్టం చేశారు. దాడుల సమయంలో దాదాపు రూ.20 లక్షల లోపు మాత్రమే నగదు తమ వద్ద ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన అన్ని లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారని, అన్నింటినీ రికార్డుల్లో ఉంచి చూశారని అన్నారు. ప్రొడక్షన్ సంస్థ నుంచి లభ్యమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని అధికారులు తమకు తెలిపారన్నారు.