తమిళ అగ్ర హీరో సూర్య తెలుగు సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. దీని తర్వాత మరో తెలుగు దర్శకుడి కథకు కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ దర్శకుడెవరో కాదు, బ్లాక్బస్టర్ ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్.
ఇటీవలే సూర్యకు పరశురామ్ ఓ కథ వినిపించారట. సూర్యకు కూడా కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మిస్తారని సమాచారం. ఇదిలావుంటే, వెంకీ అట్లూరి సినిమా తర్వాత ఓ తమిళ సినిమాకు కమిటయ్యారు సూర్య. ఆ సినిమా తర్వాత పరశురామ్ సినిమా చేయాలని సూర్య భావిస్తున్నారట. అయితే.. పరశురామ్ మాత్రం వెంకీ సినిమా వెంటనే తన సినిమా చేయాలని పట్టుబడుతున్నాడని తెలుస్తున్నది.