Dil Raju | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆయన బేనర్ నుండి సినిమా వచ్చిందంటే దాదాపు హిట్ అనే చెప్పాలి. ఇటీవల రామ్ చరణ్‌తో చేసిన గేమ్ ఛేంజర్ పెద్ద దెబ్బ కొట్టింది.అయితే ఆయనేమి కుంగిపోలేదు. మంచి ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నాడు. ఇక దిల్ రాజు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. దిల్ రాజు రెండో వివాహం గురించి అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఆయన మొదటి భార్య అనిత మృతి చెందిన తర్వాత తేజస్వినిని వివాహం చేసుకున్నారు. కరోనా సమయంలో కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్విని, తాను దిల్ రాజును ఎలా కలిశాను, వీరి వ్యవహారం పెళ్లి వరకు ఎలా వెళ్లింది అనే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తేజస్విని మాట్లాడుతూ ..“నాకు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా ఏమీ తెలియదు. మా ఇంట్లో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చూసేవాళ్లం, అదీ దసరాకే. ఆ సమయంలో దిల్ రాజు గారితో పరిచయం ఏర్పడింది. మొదట ఆయన ఎవరో కూడా తెలియదు. డైరెక్టర్ అయ్యుంటారని అనుకున్నా. కానీ తర్వాత గూగుల్ చేశాక ప్రొడ్యూసర్ అని తెలిసింది,” అంటూ చెప్పుకొచ్చారు. ఆయనకి పెళ్లైందని తెలిసిన తర్వాత, ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లకూడదని నిశ్చయించుకున్నా. కాస్త వెనక్కు తగ్గాను. కానీ కొంతకాలం తర్వాత మనం జీవితం లో ముందుకెళ్లాలంటే నిజాయితీతో ఉండే వ్యక్తి ఉంటే సరిపోతుందని భావించాను. అందుకే ఆయనతో జర్నీ మొదలుపెట్టాను అని వివరించారు తేజస్విని.
“నేను మా పెద్ద మామయ్య, పిన్నిని దగ్గరే పెరిగాను. నా పెళ్లి విషయంలో తుది నిర్ణయం వారిదే. దిల్ రాజు గారు ఓ సారి ఎవరిని ఒప్పించాలి? అనిఅడిగారు. అప్పుడు మా పెద్దమామయ్య గురించి చెప్పాను. ఆయన మా ఫ్యామిలీలో హిట్లర్ లాంటి వ్యక్తి. ఊహించని విధంగా ఆయనే ముందుగా అంగీకరించారు. కానీ ఇతర కుటుంబ సభ్యులు మాత్రం తిరస్కరించారు. చివరికి వారందరినీ ఒప్పించి పెళ్లి జరిగిందని చెప్పారు తేజస్విని. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. తేజస్వినీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తేజస్విని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ పిక్స్‌తో పాటు తన పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంది.