అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్ ది హంటర్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసిన ఏషియన్ సునీల్, దిల్‌రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలకాలంలో తమిళ డబ్బింగ్ చిత్రాలను అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారని, తెలుగు టైటిల్స్‌ను విస్మరిస్తున్నారని, ఈ ధోరణి మంచిదికాదంటూ సోషల్‌మీడియాలో విమర్శలొచ్చాయి. వాటిపై వివరణ ఇస్తూ బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘తెలుగులో ఈ సినిమాకు ‘వేటగాడు’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ ఆ టైటిల్‌ను వేరేవాళ్లు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. తెలుగు డబ్బింగ్ సినిమాల విషయంలో తమిళంలోనూ ఒకప్పుడు తమిళ టైటిల్సే పెట్టాలనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమా గ్లోబల్‌గా ఎదుగుతున్నది. వేరే భాషల్లో ప్రాంతీయ టైటిల్స్ దొరికితే పెడుతున్నారు..లేదంటే అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఏ టైటిల్ పెట్టినా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు’ అన్నారు. డబ్బింగ్ చిత్రాలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదని, కానీ ఇప్పుడు సినిమాలు అన్ని భాషల్లో విడుదలవుతున్నాయని, డబ్బింగ్ చిత్రాల వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని సురేష్‌బాబు పేర్కొన్నారు. సినిమాకు భాషా భేదాలు, హద్దులు లేవని, కథ ప్రకారం ఏ భాషలోనైనా రిలీజ్ చేయొచ్చని, ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని రానా తెలిపారు.