సహనటీనటుల పట్ల చక్కటి గౌరవ మర్యాదల్ని ప్రదర్శించడంతో పాటు తనదైన విశిష్ట ఆతిథ్యంతో ఆకట్టుకుంటారు అగ్ర హీరో ప్రభాస్. ఆయన సహృదయతకు ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. ఇక ప్రభాస్‌తో కలిసి పనిచేసిన నటీనటులు ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన్ని పొగడ్తల్లో ముంచెత్తుతుంటారు. ఇప్పుడీ వరుసలో కథానాయిక కృతిసనన్ చేరింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్నది. మరోవైపు కృతిసనన్ నటించిన తాజా చిత్రం ‘భేడియా’ (తెలుగులో ‘తోడేలు’) ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అనేకమార్లు ప్రభాస్ గురించి ప్రస్తావించింది కృతిసనన్.‘ఆదిపురుష్’ షూటింగ్ టైమ్‌లో హిందీ, తెలుగు భాషల విషయంలో ఇద్దరం పరస్పరం సహాయం చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా వుండగా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతిసనన్‌కు ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.
ప్రభాస్, టైగర్‌ష్రాప్, కార్తిక్ ఆర్యన్..ఈ ముగ్గురిలో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు? ఎవరిని పెళ్లాడాలనుకుంటున్నారు? అని జర్నలిస్ట్ అడిగినప్పుడు.. కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్ చేస్తానని, టైగర్‌తో డేటింగ్ చేస్తానని, ప్రభాస్‌ను పెళ్లాడతానని సమాధానమిచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ వ్యక్తిత్వం మీద అభిమానంతోనే కృతిసనన్ ఆ మాటలు చెప్పిందని, వాటిలో ఆరా తీయాల్సిన రహస్యమేమీ లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.