Dhurandhar On Netflix | బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించిన రణ్వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా రికార్డు కలెక్షన్లను సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix) ఈ సినిమా హక్కులను రికార్డు ధరకు దక్కించుకోగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు బీ టౌన్ నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ‘రా’ (RAW) ఏజెంట్గా పవర్ఫుల్ నటనను కనబరచగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరిశారు. పాకిస్థాన్లోని ప్రమాదకరమైన ల్యారీ ప్రాంతంలో సాగే అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ధురంధర్ 2’ కూడా రూపొందుతోంది, అది మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.