Dhurandhar 2 | బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన వివాదం ముసురుకుంది. ఈ సినిమాలో సాయుధ దళాల రహస్యాలను, వారి కార్యకలాపాలకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిర్గతం చేశారని, దీనివల్ల దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ దిల్లీ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. సశస్త్ర సీమా బల్ (SSB) విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దీపక్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది కల్పిత కథ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. దేశ భద్రతా దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తం చేసిన ఆందోళనలను, అభ్యంతరాలను అంత తేలికగా తీసిపారేయలేం. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను న్యాయస్థానం ఆదేశించింది.
రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, దర్శకుడు ఆదిత్యధర్ కాంబినేషన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ధురంధర్ 2’ గత మార్చి నెలలో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం విదేశాల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, భారతీయ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇండియాలో ఈ సినిమా జూన్ 4 నుంచి ‘జియో హాట్‌స్టార్’ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.