Arun Khetarpal | బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis) ట్రైలర్ తాజాగా విడుదలైంది. చిన్న వయసులోనే దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రను అందుకున్న వీరుడు, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ (Arun Khetarpal) జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis). ఈ బయోపిక్‌లో అరుణ్ ఖేతర్పాల్ పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద (Agastya Nanda) నటిస్తుండగా.. దివంగత నటుడు ధర్మేంద్ర, పాతల్ లోక్ నటుడు జైదీప్ అహ్లావత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘అంధాధున్’ ఫేం దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మొదట డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అవతార్, ధురంధర్ చిత్రాల వలన వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాను జనవరి 01 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నాటి వాస్తవ సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించనుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి దేశం కోసం వీర మరణం పొందిన అరుణ్ ఖేతర్పాల్ త్యాగాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. ఆ వీరత్వం, పోరాట పటిమ కారణంగానే ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర పురస్కారం లభించింది. ఈ చిత్రంలో ధర్మేంద్ర.. అరుణ్ ఖేతర్పాల్ తండ్రి అయిన బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేతర్పాల్ పాత్రలో నటించారు. దేశం కోసం కొడుకు ప్రాణాలర్పించినా, ఒక సైనికుడిగా గర్వపడే తండ్రి పాత్రలో ధర్మేంద్ర నటన హైలైట్‌గా నిలవనుంది. ట్రైలర్లో ఆయన డైలాగ్ డెలివరీ మరియు భావోద్వేగాలు కంటతడి పెట్టిస్తున్నాయి.