Kasthuri Raja | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తండ్రి, ప్రముఖ చిత్రనిర్మాత కస్తూరి రాజా, అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్‌కి లీగల్ నోటిసులు పంపాడు. తన అనుమతి లేకుండా తన పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అనధికారికంగా ఉపయోగించారని ఆయన ఆరోపిస్తు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో తనకు చెందిన మూడు పాటలను ఉపయోగించారని కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారు. ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్‌లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కస్తూరి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో ఇళయరాజా పాటలను కూడా అనధికారికంగా ఉపయోగించారని ఆరోపణలున్నాయి. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా కూడా తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించినందుకు మైత్రి మూవీ మేకర్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. రూ. 5 కోట్ల పరిహారం డిమాండ్ చేయడంతో పాటు, సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కూడా కోరారు.
అయితే, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నుండి యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ, సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, మ్యూజిక్ లేబుల్స్ నుండి ఎన్ఓసీలు (NOCs) పొందామని పేర్కొన్నారు. ఈ వివాదం ఇప్పుడు కస్తూరి రాజా లీగల్ యాక్షన్‌కు సిద్ధం కావడంతో మరింత ముదిరే అవకాశం ఉంది.