ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సార్’. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్నది. తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నది. ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో ధనుష్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపథ్యంగా సాగే చిత్రమిది. సినిమాకు ధనుష్ పూర్తి సహకారం అందిస్తున్నారు.
ఆయనతో కలిసి పనిచేయడాన్ని మర్చిపోలేను. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జె యువరాజ్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్.