తమిళ అగ్రహీరో ధనుష్‌పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) అగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాక, అతని విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. కొందరు నిర్మాతల దగ్గర అధికమొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకొని, షూటింగ్స్‌కి సహకరించడంలేదన్నది ధనుష్‌పై అభియోగం. దీనిపై టీఎఫ్‌పీసీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తమిళ సినిమా అభ్యున్నతి కోసం కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, అలాగే ఈ ఏడాది నవంబర్ 1 నుంచి సినిమా సంబంధిత కార్యకలాపాలను కూడా ఆపివేయాలని నిర్ణయించింది. సినిమా నిర్మాణ వ్యయం, హీరోల పారితోషికాలు, ఇతర ఖర్చులపై నియంత్రణ కోసం టీఎఫ్‌పీసీ ఈ నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగానే హీరో ధనుష్ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.
కొత్త సినిమాలకు ధనుష్‌ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని కౌన్సిల్ కోరింది. గత ఏడాది శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి ధనుష్ భారీ మొత్తంలో అడ్వాన్స్ అందుకున్నాడని, కానీ షూటింగ్‌కి మాత్రం రాలేదనే అభియోగం ఉందని టీఎఫ్‌పీసీ తెలిపింది. ఇలా ధనుష్ చాలామంది నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు అందుకున్నందున, నటుడు ధనుష్‌తో కొత్త సినిమాను ప్రారంభించే ముందు సదరు నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను సంప్రదించాలని కోరారు. హీరో ధనుష్‌కి ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పాలి.