స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘రాయన్’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటుడిగా, దర్శకుడిగా ధనుష్ అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా ధనుష్ మరోమారు మెగాఫోన్ పట్టబోతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందబోతున్న నాలుగో చిత్రమిది కావడం విశేషం. నూతన నిర్మాణ సంస్థ డాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
మంగళవారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. తనదైన శైలి యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ధనుష్ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, దర్శకుడిగా ఆయనకు మరో విజయం ఖాయమని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ధనుష్ ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక మందన్న ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకానుంది.