ధనుష్, సాయిపల్లవి జంటగా 2018లో వచ్చిన ‘మారి- 2’ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని అందుకున్నది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ..’ సాంగ్ అయితే.. తెలుగులో కూడా మోతమోగిపోయింది. అందులో ధనుష్, సాయిపల్లవి కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే.. మళ్లీ ఆ కలయికలో సినిమా రాలేదు.
చెన్నై తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరూ కలిసి నటించనున్నారు. మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. నటనకు ఆస్కారం ఉండే బలమైన పాత్రలను సృష్టించడంలో సిద్ధహస్తుడిగా తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ పేరు పొందారు. ధనుష్, సాయిపల్లవిల కోసం ఆయన ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారట.
సాయిపల్లవి, ధనుష్ కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తమిళ మీడియా చెబుతున్నది. నవంబర్ నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. అగ్ర హీరోల పానిండియా ట్రెండ్ కొనసాగుతున్నది కాబట్టి ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.