‘పోరాటఘట్టాల్లో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ప్రతి ఫైట్‌ను కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ చేస్తాం. లేకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో కొత్తదనం తీసుకురాలేం’ అన్నారు రామ్‌లక్ష్మణ్. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి ఫైట్మాస్టర్స్గా వారిద్దరూ రాణిస్తున్నారు. బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలకు రామ్‌లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాలు ఈ నెల 12, 13 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సందర్భంగా రామ్‌లక్ష్మణ్ మాట్లాడుతూ ‘ఫైట్స్‌లో ఎమోషన్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ‘వీరసింహా రెడ్డి’ చిత్రంలో బాలకృష్ణగారు కుర్చీలో కూర్చొని చేసే ఓ ఫైట్ కంపోజ్ చేశాం. థియేటర్లో అది కొత్త ఊపును తీసుకొస్తుంది. టర్కీలో షూట్ చేసిన ఇంటర్వెల్ ఫైట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ ఇంటర్వెల్ ఎపిసోడ్లో చిరంజీవిగారు రెండు గన్స్ పట్టుకొని ైస్టెలిష్‌గా కనిపిస్తారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రెండు చిత్రాలు కథాపరంగా పూర్తి భిన్నమైనవి కావడంతో పోరాటఘట్టాల్ని కూడా అదే తీరుగా డిజైన్ చేశాం. ఇద్దరు హీరోల బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా ఫైట్స్ కంపోజ్ చేశాం. ‘వీరసింహా రెడ్డి’ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి, రవితేజ మధ్య ఎమోషనల్ డ్రామా హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది’ అన్నారు.