Devi Sri Prasad | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ)కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 19న విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో డీఎస్పీ నిర్వహించాలనుకున్న లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు విశాఖ పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేమని సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.
ఇటీవల విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లోని ఆక్వా వరల్డ్‌లో ఓ బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఈ నిర్ణయానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా ఆందోళనలతో పోలీసులు కాన్సర్ట్‌కు అనుమతి ఇవ్వలేదు. అయితే, ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసుకున్నారు. ఆన్లైన్లో భారీ సంఖ్యలో టికెట్లు విక్రయించబడ్డాయి. చివరి నిమిషంలో అనుమతి రద్దు కావడంతో డీఎస్పీ, నిర్వాహకులతో పాటు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కాన్సర్ట్‌ను మరో తేదీకి రీషెడ్యూల్ చేస్తారా లేక వేరే వేదికకు మారుస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ఘటన టాలీవుడ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.