Jr. NTR | ‘దేవర’ సినిమా.. అటు తారక్‌కి, ఇటు దర్శకుడు కొరటాల శివకీ నిజంగా పెద్ద టాస్క్. ఎందుకంటే.. రాజమౌళీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేస్తున్న సినిమా ఇది. రాజమౌళితో చేసిన సినిమా ఘనవిజయం సాధించడం, ఆ తర్వాత వేరే దర్శకుడితో చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడం.. ఇప్పటివరకూ ప్రతి హీరోకీ జరిగిందిదే.
రాజమౌళీ సినిమా చేసి, ఆ వెంటనే హిట్ కొట్టిన హీరో లేడూ, హిట్ ఇచ్చిన దర్శకుడూ లేడు. అందుకే తారక్, కొరటాల శివలకు ‘దేవర’ ఓ అగ్నిపరీక్ష. అందుకే.. ఎలాగైనా చరిత్రను తిప్పిరాయాలని, ట్రెండ్‌ని బ్రేక్ చేయాలని కసితో పనిచేస్తున్నారు తారక్, కొరటాల. శరవేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఒకటి వెలుగు చూసింది. ఇందులో కథానాయికగా జాన్వీకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈమెతోపాటు శృతి మరాటే కూడా మరో కథానాయికగా నటిస్తున్నట్టు తెలిసింది. ఒకే ఎన్టీయార్ పక్కన ఇద్దరు హీరోయిన్లు అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఇందులో తారక్ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఓ ఎన్టీయార్‌తో జాన్వీ, మరో ఎన్టీయార్‌కి జోడీగా శృతి నటిస్తున్నారట. ఈ ఏడాది జూన్ నుంచి హృతిక్‌రోషన్ ‘వార్ 2’ చిత్రానికి తారక్ డేట్స్ ఇచ్చారు. అందుకే మే నాటికి ఎన్టీయార్ షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు కొరటాల. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘దేవర’ విడుదలయ్యే అవకాశం ఉంది.