Devara Movie – Beyond Fest | నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ‘దేవర’ (Devara) ఒకటి. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా విడుదలకు ఇంకా 14 రోజులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా.. 1 మిలియన్‌కు పైగా టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న ‘బియాండ్ ఫెస్ట్’ అనే హాలీవుడ్ ఫిలిం ఈవెంట్లో ‘దేవర’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ‘బియాండ్ ఫెస్ట్’ అధికారులు ఎక్స్ వేదికగా ప్రకటించారు. కాగా ఈ ఈవెంట్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగనుంది.
మరోవైపు ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. ఇక మూవీలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ ఉంటుందని సెన్సార్ బోర్డ్ చెప్పినట్లు టాక్.