‘ప్రస్తుతం మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. సినిమా చిన్నా పెద్దా అనే విషయం కంటే కంటెంటే ప్రధానం. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. హారర్ థ్రిల్లర్ ‘డీమాంటీ కాలనీ-2’ ఈ నెల 23న తెలుగులో విడుదలకానుంది. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడు. బి.సురేష్ రెడ్డి, మానస రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హారర్ కంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయని, తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత బి.సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమాకు మరో రెండు భాగాలను తెరకెక్కించబోతున్నామని దర్శకుడు ఆర్.జ్ఞానముత్తు తెలిపారు.