Abhishek Bachchan | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన పేరు, ఫోటోలు, వాయిస్, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయమూర్తి తేజస్ కారియా కీలక తీర్పు ఇచ్చారు. నటుడిగా అభిషేక్ బచ్చన్‌కి ఉన్న పేరు, గుర్తింపు, గౌరవం ఇవన్నీ అతని వృత్తి వలన వచ్చినవని, అవి అనధికారంగా వాడటం వల్ల అతని ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. కొన్ని వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అభిషేక్ బచ్చన్ అనుమతి లేకుండా, అతని పేరు, ఫోటోలు, వాయిస్, డీప్‌ఫేక్ వీడియోలు వాడుతూ అసభ్య కంటెంట్ కూడా రూపొందించారని పిటిషన్లో పేర్కొనడం జరిగింది.
అభిషేక్ బచ్చన్ పేరు, ఫోటోలు, వాయిస్, సంతకం లాంటి విషయాలను అనుమతి లేకుండా వాణిజ్య ఉపయోగాలకు వినియోగించరాదు. AI టెక్నాలజీ ద్వారా రూపొందించిన అసభ్యమైన వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తక్షణం ఆపాలి.ఈ చర్యలు చట్ట విరుద్ధమైనవని కోర్టు తేల్చింది. ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాయ్ కూడా తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తీరుపై ఆమె కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐశ్వర్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఐశ్వర్య రాయ్ తన పిటిషన్లో, కొందరు వ్యక్తులు తాను అనుమతించకపోయినా తన పేరును, ఫొటోలను వాణిజ్య ప్రకటనల కోసం వాడడమే కాకుండా, కొన్ని ఫోటోలను మార్ఫ్ చేసి అసభ్య కంటెంట్‌గా తయారుచేసి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్యలు తన వ్యక్తిగత హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని, తన ప్రైవసీని ఉల్లంఘిస్తున్నాయని వాదించారు.
ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు , ఐశ్వర్య రాయ్ వాదనలతో ఏకీభవించి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇకపై ఆమె అనుమతి లేకుండా ఆమె పేరు, ఫోటోలు, వీడియోలు వాణిజ్య లేదా ప్రచార ప్రయోజనాల కోసం వినియోగించరాదు అని స్పష్టం చేసింది. అలాగే, AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ సృష్టించిన అసభ్య కంటెంట్‌ను తక్షణంగా తొలగించాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వచ్చే ఏడాది జనవరి 15 వరకు అమల్లో ఉంటాయి.
ఈ తీర్పుతో ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత హక్కులకు, ప్రతిష్ఠకు న్యాయ పరిరక్షణ లభించింది. డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు , ప్రైవసీ ఉల్లంఘనలు , డీప్‌ఫేక్‌ల వలన జరిగిన దుర్వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో, ఈ తీర్పు సైబర్ చట్టాలను మరింత బలోపేతం చేస్తోంది. అంతేకాదు, భవిష్యత్తులో ఇతర సెలబ్రిటీలు కూడా తమ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడానికి ఇది ప్రేరణగా నిలవనుంది.