Deepika Padukone In Singham-3 | బాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలలో దీపికా పదుకొనే ఒకరు. దశాబ్ధన్నర కాలానికి పైగా బాలీవుడ్‌ను ఏలుతూ వస్తుంది. దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో దీపిక జోడీ కట్టింది. కేవలం ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో దీపికాది అగ్రస్థానం. ఇక ప్రస్తుతం ఈమె మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా.. రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా దీపికా బంపర్ ఆఫర్ కొట్టేసింది.
బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టితో కలిసి దీపికా మరోసారి పనిచేయనుంది. రోహిత్ శెట్టి సినిమాల్లో ‘సింగం’ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 తెరకెక్కబోతుంది. కాగా ఈ మూడో పార్ట్‌లో దీపికా భాగం కానుంది. ‘సింగం-3’లో దీపికా లేడీ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు తాజాగా రోహిత్ శెట్టి వెల్లడించాడు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత దీపికా దాదాపు 9ఏళ్ళకు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈయన సర్కస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించాడు. రణ్వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సర్కస్ సినిమా డిసెంబర్ 23న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.
ఇక దీపికా ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి నటించిన పఠాన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. జాన్ అబ్రహం కీలకపాత్రలో పాత్రలో నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. దీనితో పాటుగా హృతిక్ రోషన్ ‘ఫైటర్’, ప్రభాస్ ‘ప్రాజెక్ట్-K’ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది.