మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ మూవీ సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా స్క్రిప్ట్, కాస్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే నాయిక ఎవరైతే బాగుంటుందనేదీ ఆలోచిస్తున్నారు. హీరోయిన్ కోసం ఈ టీమ్ ఒక ఆప్షన్‌గా దీపిక పడుకోన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో దీపిక నటిస్తున్నది. ఈ పాన్ ఇండియా సినిమా విడుదలయ్యాక ఆమె దక్షిణాది ప్రేక్షకులకూ మరింత చేరువవుతుంది. అది మహేష్ ప్రాజెక్ట్కూ కలిసొస్తుందని ఆశిస్తున్నారు.
మహేష్ రాజమౌళి కాంబినేషన్ భారీ ప్రాజెక్ట్‌కు దీపిక పడుకోన్ లాంటి స్టార్ హీరోయిన్ మరింత క్రేజ్ తీసుకొస్తుంది. అన్నీ కుదిరితే మహేష్, దీపిక పెయిర్ తెలుగు తెరపై సందడికి సిద్ధమైనట్లే. లోకం చుట్టి వచ్చే సాహసవీరుడి కథతో సినిమా రూపొందిస్తామని దర్శకుడు ఇప్పటికే చెప్పేశారు. ఈ చిత్రానికి కేఎల్ నారాయణ నిర్మాణ బాధ్యతలు వహించబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.