పరశురాముడి పౌరాణిక ఇతివృత్తం ఆధారంగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ‘మహావతార్’ పేరుతో బాలీవుడ్లో ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించే ఈ సినిమా ప్రస్తుతం పూర్వనిర్మాణ దశలో ఉంది. అధునాతన గ్రాఫిక్స్ హంగులతో భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పడుకోన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. పరశురాముడి పాత్రకు ధీటుగా బలమైన భావోద్వేగాలతో కథానాయిక పాత్ర ఉంటుందని, దీనికి దీపికా పడుకోన్ స్థాయి తార మాత్రమే న్యాయం చేయగలదని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వారు దీపికా పడుకోన్తో చర్చలు జరిపారని, ఆమె సమ్మతిని తెలియజేయాల్సి ఉందని బాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. ఈ పౌరాణిక చిత్రాన్ని తన కెరీర్లోనే చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారట విక్కీ కౌశల్. పరశురాముడి పాత్ర కోసం సన్నద్ధతలో భాగంగా ఆయన మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.
జనవరిలో ‘మహావతార్’ చిత్రీకరణ మొదలుపెట్టి వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని ‘స్త్రీ-2’ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మించనున్నారు.