Deepavali Movie OTT | ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను అందుకున్న చిత్రం ‘కిడ’. ఈ సినిమాకు ఆర్.ఎ.వెంకట్ దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ సీనియర్ ప్రోడ్యూసర్ స్రవంతి రవికిశోర్ నిర్మించాడు. అయితే తమిళంలో ఘన విజయం అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో దీపావళి అనే పేరుతో నవంబర్ 11న విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా(AHA)లో ఈ సినిమా డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథలోకి వెళితే…‘పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. తాత, మనవడు, ఓ మేక మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలని మనవడు కోరడంతో మేకను అమ్మడానికి సిద్ధపడతాడు తాత. మొక్కు ఉన్న మేక కావడంతో దానిని కొనడానికి ఎవరూ ముందుకురారు. ఈ నేపథ్యంలో కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది.