కన్నడ ‘దియా’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యాడు యువ నటుడు దీక్షిత్ శెట్టి. ఆనంతరం తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా దీక్షిత్ శెట్టి, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి. సినిమాస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. కె.కె.దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు.
90 దశకంలో నడిచే పీరియాడిక్ క్రైమ్ డ్రామా ఇదని, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించబోతున్నామని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేష్ బన్సెల్, సంగీతం: పూర్ణాచంద్ర తేజస్వి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శేఖర్ యలమంచిలి, దర్శకత్వం: కె.కె.