Death Rumors | సోషల్ మీడియాలో ఇటీవల బతికున్న వాళ్లని చంపేయడం కామన్ అయిపోయింది. ఒక్కోసారి కొందరు సెలబ్రిటీలు తాము బతికే ఉన్నామని వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా ప్రముఖ హిందీ నటుడు రజా మురాద్ బతికుండగానే చనిపోయారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగడం తీవ్ర కలవరం రేపింది. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా పాకిపోయింది. ఒక వ్యక్తి తప్పుడు ఆరోపణలతో ఆయన మరణ వార్తను పోస్ట్ చేయడంతో రజా మురాద్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ తప్పుడు వార్త వల్ల మురాద్‌కు వేలాది ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. “ప్రతీ ఒక్కరికీ సమాధానం ఇవ్వడం చాలా కష్టంగా మారింది. నాలుక ఎండిపోయింది. నేను బతికే ఉన్నాను అని పదే పదే చెప్పాల్సి రావడం వల్ల శారీరకంగా ఎంతో అలసటకు గురయ్యాను,” అని అన్నారు మురాద్.
73 ఏళ్ల రజా మురాద్ ఈ తప్పుడు ప్రచారంపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ, తనపై కావాలనే అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. “ఈ వ్యక్తి నాపై ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి మనస్తత్వపరంగా అనారోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతను జీవితం లో విలువైనదేమీ సాధించలేదని అనిపిస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, ఆ వ్యక్తి నా పుట్టినరోజు, నకిలీ డెత్ డేట్ వంటి వివరాలు కూడా కల్పించి ప్రచారం చేశాడంటూ వెల్లడించారు. ఇది నన్ను ప్రేమించేవాళ్లలో గందరగోళాన్ని, భయాన్ని కలిగించింది. ఇది అసహనానికి గురిచేసింది అని అన్నారు.
ఈ ఘటనపై రజా మురాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రజా మురాద్ హిందీ పరిశ్రమలో తన అద్భుతమైన వాయిస్, విలక్షణ నటన తో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ‘మేఘ్ బర్సేంజ్’ (Prime Video), ‘మార్తే దమ్ తక్ వంటి డాక్యుమెంటరీలలో కనిపించారు. అలాగే జోధా అక్బర్, గోలియోంకీ రాస్లీలా రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.