‘డెడ్‌పూల్’.. అమెరికన్ సూపర్ హీరోల సినిమాలను చూసేవారిని అమితంగా ఆకట్టుకున్న సినిమా ఇది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన ‘డెడ్‌పూల్-2’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ రాబోతున్న మరో సరికొత్త సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్ ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్’.
షాన్ లెవీ తెరకెక్కించిన ఈ సినిమాలో రేయాన్ రేనాల్డ్స్, హ్యూ జాన్‌మెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన టీజర్.. కేవలం 24 గంటల్లోనే 365 మిలియన్ వ్యూస్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటిదాకా ఏ చిత్రమూ 24 గంటల వ్యవధిలో ఈ స్థాయి వ్యూస్‌ను పొందలేదు.