పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ సాంగ్ అభిమానులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ బర్త్ డేకి ఇది అదిరిపోయే గిఫ్ట్ అని ప్రశంసలు కురిపించారు.అయితే ఈ పాటలో పోలీసుల గురించి రాసిన కొన్ని పదాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
పాట లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పోలీసులని కించ పరిచే విధంగా పదాలు రాసారని హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీ తన ట్విట్టర్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టమని చురకలు అంటించారు.పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయని డీసీపీ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. మరి దీనిపై రచయిత, చిత్ర నిర్మాత నుండి ఏదైన స్పందన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్యా మీనన్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.