Tollywood | అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల.. కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. మన దర్శకులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. కథ సెట్ అవ్వాలి కానీ టైటిల్ ఏదైనా ఫర్వాలేదు అంటున్నారు. ముఖ్యంగా డిఫరెంట్ టైటిల్ ఉంటే సినిమాపై అంచనాలు బాగానే పెరుగుతాయి. అందుకే అలాంటి టైటిల్స్ కోసమే ఎక్కువగా వెతికి చూస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే సినిమాలకు వారాల రూపంలో టైటిల్స్ పెడుతున్నారు. తాజాగా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మొదలైన సినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
దీని వెనక కథ ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంతకుముందు కూడా అంటే సుందరానికి అనే వినూత్నమైన టైటిల్‌తో వచ్చాడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు కూడా సరిపోదా శనివారం అంటున్నాడు. నానిని సంకెళ్లతో కట్టేసి ఉన్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కేవలం వివేక్ మాత్రమే కాదు.. అజయ్ భూపతి కూడా మంగళవారం అంటూ వస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్లీ అజయ్‌కు రాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది.
దాంతో ఈసారి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు అజయ్ భూపతి. ఒక ఊరిలో ప్రతి మంగళవారం అనుకోకుండా చనిపోతూ ఉంటారు. దాంతో అసలు మంగళవారం ఆ ఊర్లో ఏం జరుగుతుంది అనేది అసలు కథ. ఆ మధ్య కీరవాణి కొడుకు సింహ కూడా తెల్లవారితే గురువారం అనే సినిమాతో వచ్చాడు. ఇక ఆదివారం పేరుతో కూడా ఒక సినిమా వచ్చింది. సోమవారం, బుధవారం మాత్రమే మిగిలిపోయాయి. వాటితో కూడా సినిమాలు వచ్చేస్తే ఓ పనైపోతుంది.