Dasara | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సింగరేణి ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలో జరిగే స్టోరీతో పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది.
విలేజ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ ప్లాన్ జరుగుతోందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. నాని- శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోమరోసారి సీక్వెల్‌కు రెడీ అవుతుందన్నట్టు వార్తలు ఊపందుకుంటుండగా.. ఫస్ట్ పార్టులో కథకు పర్ఫెక్ట్ ముగింపు ఉన్న నేపథ్యంలో మరి సీక్వెల్ ఎలా సాధ్యమవుతుందని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి ఇది సీక్వెల్ కాకుండా దసరా 2గా కొత్త సబ్జెక్టుతో వస్తుందేమో చూడాలి.
నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సరిపోదా శనివారం ఒకటి. షూటింగ్ దశలో ఉంది. మరోవైపు బలగం డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎల్లమ్మ టైటిల్ ఫైనల్ చేశారు. ఒకవేళ దసరా 2 కనుక వస్తే ఈ రెండు సినిమాల తర్వాతే అవకాశముంటుంది. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ సీక్వెల్‌పై ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.