నాని హీరోగా నటించిన సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని సమీపంలోని ఓ గ్రామంలో జరిగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. పాన్ ఇండియా మూవీగా ఈ నెల 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రానికి పనిచేసిన అనుభవాలను తెలిపారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల. ఆయన మాట్లాడుతూ…‘ఈ సినిమా కోసం 22 ఎకరాల స్థలంలో గ్రామ సెట్ నిర్మించాం. సినిమా 98 శాతం షూటింగ్ ఈ సెట్లోనే జరిపాం. గ్రామంలోని స్కూల్, ప్లే గ్రౌండ్, బార్ వంటి సెట్స్ నిర్మించాం. గ్రౌండ్లో బతుకమ్మ ఆటలు, రావణదహనం వంటి పండుగ సీన్స్ చేశాం. ఆ గ్రామంలోని ప్రజలు బొగ్గు గనిలో పనిచేస్తుంటారు. బొగ్గు తీసుకెళ్లే లారీలు నిత్యం ఊరు చుట్టూ తిరుగుతుంటాయి. అలా ఒక రస్టిక్ వాతావరణం సెట్లోకి తీసుకురాగలిగాం. హైదరాబాద్ సమీపంలో ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మించాం. చిత్రానికి సెట్ వర్క్ ఆకర్షణగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. దర్శకుడు శ్రీకాంత్ తెలంగాణ నేపథ్య కథను సహజంగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నాని వైవిధ్యంగా కనిపిస్తారు. నాని చేస్తున్న కొత్త చిత్రాలకూ పనిచేస్తున్నా.’ అని చెప్పారు.