Dance Ikon 2 | ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఐకాన్ 2 షో ఎంత రక్తి కట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట అంటూ బుల్లితెరపై డాన్స్ షోతో ట్రెండ్ సెట్ చేసిన ఓంకార్ అన్నయ్య తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు. ఈ షోనే ఆయన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆట షో సూపర్ సక్సెస్ కావడంతో.. ఆట జూనియర్స్ని కూడా అదే రేంజ్లో సూపర్ సక్సెస్ చేశారు ఓంకార్. ఆ తరువాత ఓంకార్ హోస్టింగ్‌లో డాన్స్ షో వస్తుందంటే.. అది సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో కలిగింది. ఇప్పుడు ఓంకార్.. ఓటీటీలోనూ సత్తా చూపిస్తున్నారు. ఓంకార్ నేతృత్వంలో ఆహా ఓటీటీలో ‘డాన్స్ ఐకాన్ సీజన్ 2’ గ్రాండ్ ఫినాలేకి చేరగా.. మే 16న జరిగిన ఈ ఫినాలే ఈవెంట్లో విజేతను ప్రకటించారు.
డాన్స్ ఐకాన్ సీజన్ 2 విన్నర్ గా ఎనిమిదేళ్ల పాప బినీతా ఛెత్రి టైటిల్‌ని కైవసం చేసుకుంది. గ్రాండ్ ఫినాలేను రెండు ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ చేయగా, ఫస్ట్ ఎపిసోడ్ మే 9న ముగిసింది. ఇక సెకండ్ ఎపిసోడ్ మే 16న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హాజరై విజేతను ప్రకటించారు. సాయి ధరమ్ చేతల మీదిగా ట్రోఫీని అందజేశారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్లు చిన్నారి బినీతకికు ఐదు లక్షల ప్రైజ్ మనీ అందించారు. వచ్చినవాడు గౌతమ్ మూవీ టీమ్ సైతం సందడి చేసింది. ఈ మూవీలో హీరోగా నటిస్తున్న అశ్విన్ బాబు డ్యాన్స్ ఐకాన్ 2 విజేతకు మరో 5 లక్షలు బహుమతిగా అందించారు.
డ్యాన్స్ ఐకాన్ 2లో విజేతగా నిలిచిన బినీతా ఛెత్రి కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ మెంటార్షిప్ లో పాల్గొంది. ప్రతి వారం అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో జడ్జీలను, ప్రేక్షకులను ఆకట్టుకున్న బినీతా ఛెత్రి.. చివరకు విజేతగా నిలవడంతో యష్‌తో పాటు బినీతా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ,’డాన్స్ ఐకాన్’ షోకి ఓంకార్ హోస్ట్ కాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ‘జాతి రత్నాలు’ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జడ్జీలుగా చేశారు.