Dadasaheb Phalke Award | మలయాళం సూపర్‌స్టార్ (Malayalam superstar) మోహన్‌లాల్ (Mohanlal) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) అందుకోబోతున్నారు. 2023 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు 55 మంది సినీ ప్రముఖులు ఈ గౌరవం అందుకోగా.. ఈ పురస్కార గ్రహీతలకు స్వర్ణ కమల పతకం, ఒక శాలువా రూ.10 లక్షల నగదు బహుమతి అందుకుంటారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇప్పటివరకు అందుకున్న ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బి.ఎన్.రెడ్డి (1974)
ఈ అవార్డు అందుకున్న తెలుగు ప్రముఖులలో మొదటివాడు బి.ఎన్.రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి). బి.ఎన్.రెడ్డి 1974లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్లుగా నిలిచాయి. వాటిలో ‘మల్లీశ్వరి’ (1951) ‘బంగారు పాప’ (1939), ‘స్వర్గసీమ’ (1945) వంటి చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. తెలుగు సినిమా శైలిని, సాంకేతిక నైపుణ్యాన్ని ఉన్నత స్థాయికి చేర్చిన దర్శకుడిగా ఆయన పేరు పొందారు.
ఎల్.వి. ప్రసాద్ (1982)
ఎల్.వి. ప్రసాద్ భారతీయ సినీ పరిశ్రమలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మూడు భాషల్లోని తొలి టాకీ చిత్రాలలో భాగమైన ఏకైక వ్యక్తి. మొదటి భారతీయ టాకీ చిత్రం ‘ఆలమ్‌ఆరా’ (1931) ఇందులో ఆయన చిన్న పాత్రలో నటించారు. మొదటి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ (1932) కూడా ఆయన నటించారు. అలాగే మొదటి తమిళ టాకీ చిత్రం ‘కాళిదాసు’ (1931)లోనూ ఆయన నటించారు. దర్శకుడిగా ‘శావుకారు’ (1950), ‘పెళ్లిచేసి చూడు’ (1952) వంటి సినిమాలతో తెలుగు సినిమాకు కొత్త దిశానిర్దేశం చేశారు. నిర్మాతగా ‘ప్రసాద్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌ను స్థాపించి ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. హైదరాబాదులో *ప్రసాద్ స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్స్, ప్రసాద్ ఐమాక్స్* లాంటి సంస్థలను స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా సహకరించారు. ఆయన విశిష్టమైన సేవలకు గాను 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
బి. నాగిరెడ్డి (1986)
బి. నాగిరెడ్డి తెలుగు చలన చిత్ర రంగంలో అగ్రగామి నిర్మాతల్లో ఒకరు. విజయ వాహిని స్టూడియోను నిర్మించారు*, ఇది ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా పేరు గాంచింది. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా ఎన్నో క్లాసిక్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’, ‘గుండమ్మ కథ’ వంటి సినిమాలు ఆయన నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. నాగిరెడ్డి విశిష్టమైన సేవలకు గాను 1986లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
అక్కినేని నాగేశ్వరరావు (1990)
అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా చరిత్రలో ఒక మహానటుడిగా కల్పవృక్షంగా గుర్తింపు పొందారు. 1940లో ‘ధర్మపత్ని’ (1941) సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన కెరీర్లో 250కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ‘దేవదాసు’ (1953) ఆయనకు భారీ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర. ఆయన నటన ప్రతిభ, సినిమాకు చేసిన సేవలకు గాను 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తన వంతుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు.
డాక్టర్ డి. రామానాయుడు (2009)
డాక్టర్ డి. రామానాయుడు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాతల్లో ఒకరు. తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా విభిన్న భాషలలో శైలులలో సినిమాలు నిర్మించారు. మొత్తం 150కి పైగా చిత్రాలను నిర్మించి, అందులో 9 భారతీయ భాషల్లో సినిమాలు రూపొందించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు*. భారతీయ సినీ చరిత్రలో తొమ్మిది భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా ఆయన నిలిచారు. ఈ అసాధారణ కృషికి గాను 2009లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.
కే. విశ్వనాథ్ (2016)
కళాతపస్వి కే. విశ్వనాథ్ తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న అజరామరమైన దర్శకుడు. కళ, సంస్కృతి, మానవ విలువలు ప్రధానాంశాలుగా అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన చిత్రాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, మానవీయ విలువలను ప్రతిబింబించాయి. శంకరాభరణం (1980) సాగర సంగమం (1983), స్వాతిముత్యం (1986), సిరివెన్నెల (1986) వంటి క్లాసిక్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించాడు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తిగా ఆయన నిలిచిపోయారు. ఈ విశిష్టమైన కృషికి గాను ఆయనకు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.