HHVM VFX | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీర మల్లు’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా స్టోరీ బాగున్న కూడా వీఎఫ్ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) దారుణంగా ఉండడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు కొన్ని సన్నివేశాలను రీ-ఎడిట్ చేయాలని లేదా పూర్తిగా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చిత్రంలోని గ్రాఫిక్స్ నాణ్యతపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కీలక సన్నివేశాలతో పాటు, ముఖ్యంగా గుర్రపు స్వారీ, భారీ యుద్ధ సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ చాలా పేలవంగా ఉందని, ఇది సినిమాటిక్ అనుభూతిని తీవ్రంగా దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రివ్యూలలో అయితే, సినిమాలోని రెండో సగం పూర్తిగా వీఎఫ్ఎక్స్ లోపాలతో నిండి ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల కారణంగా, నిర్మాణ సంస్థ రీ-ఎడిటింగ్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ సినిమా విడుదల కాకముందు, నిర్మాత ఏ.ఎం. రత్నం ‘హరి హర వీర మల్లు’ భారీ బడ్జెట్‌తో కూడుకున్న పీరియడ్ ఫిలిం అని, 5 దేశాల్లో వీఎఫ్ఎక్స్ చేయించామని, దీనికోసం రూ. 250 కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. అయితే, సినిమా చూసిన తర్వాత అభిమానులు మరి గ్రాఫిక్స్ ఏంటి ఇలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద, ‘హరి హర వీర మల్లు’ సినిమాకు వీఎఫ్ఎక్స్ విషయంలో తీవ్ర నెగటివ్ టాక్ రావడంతో, మేకర్స్ దీనిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.