Tollywood | టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, తన తదుపరి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చిన విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్న వెంకీ, ఎంతో ఆలోచించి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇకపోతే త్రివిక్రమ్ సినిమా మాత్రమే కాకుండా, వెంకటేష్ ప్రస్తుతం ఇతర దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. కొత్త కథలు వింటూ, తదుపరి ప్రాజెక్టుల కోసం పునరాలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. గతంలో వెంకటేష్‌తో ‘లక్ష్మి’ అనే బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించిన వి.వి. వినాయక్, మళ్లీ వెంకీ కోసం ఓ మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రాయిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన వెంకటేష్‌ను కలవాలని, కథ చెప్పాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. 2006లో వచ్చిన ‘లక్ష్మి’ చిత్రం వెంకటేష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు 19 ఏళ్ల గ్యాప్ తర్వాత, మళ్లీ అదే కాంబినేషన్ తెరపైకి వస్తుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. పైగా ఇది కూడా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో ఉండనున్నట్టు సమాచారం. ‘ఇంటెలిజెంట్’ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన తర్వాత వినాయక్ కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేసినా, అది కూడా మిశ్రమ స్పందనే పొందింది. దాంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో కాంబినేషన్ కుదిరితే, వినాయక్ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.