Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హోంబలే ఫిలింస్ తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సూర్య హీరోగా, ‘జై భీమ్’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందనుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా సూర్య-జ్ఞానవేల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు వినిపించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిలింస్ నిర్మించనుండటం మాత్రం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్గా మారింది. భారీ నిర్మాణ విలువలకు పేరుగాంచిన ఈ సంస్థతో సూర్య తొలిసారి చేతులు కలపడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ సందర్భంగా హోంబలే ఫిలింస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రేమ్ బై ఫ్రేమ్, సినిమా బై సినిమా, పోరాటం బై పోరాటం తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటుడు. నిజాయితీతో కూడిన పాత్రలు, జీవితాలను ప్రతిబింబించే కథలు, ధైర్యం మరియు నమ్మకంతో సాగిన మూడు దశాబ్దాల అద్భుత ప్రయాణం. ఈ తరం అత్యంత సాహసోపేతమైన నటుడు ఇప్పుడు తన కెరీర్లోనే అతిపెద్ద వేదికపైకి అడుగుపెడుతున్నారు’’ అంటూ సూర్య సినీ ప్రయాణాన్ని సంస్థ కొనియాడింది.ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు టెక్నికల్ టీమ్ కూడా భారీగానే సిద్ధమైంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య సరసన కాయదు లోహర్ హీరోయిన్గా నటించనున్నారు. సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ పనిచేస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఫిలోమిన్ రాజ్ చేపట్టనున్నారు.
సామాజిక అంశాలను బలంగా చెప్పే దర్శకుడిగా గుర్తింపు పొందిన టి.జె. జ్ఞానవేల్, నటనకు కొత్త నిర్వచనం చెప్పే సూర్య, భారీ నిర్మాణ విలువలకు పేరుగాంచిన హోంబలే ఫిలింస్ కలయికలో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, కథాంశం, షూటింగ్ షెడ్యూల్ తదితర వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం సూర్య కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటిగా మారింది.