Coolie | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం కూలీ ఈ నెల ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమాపై క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు రజనీ అభిమానులు తహతహలాడుతున్నారు. రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ నటీనటులు ఇందులో భాగం కావడంతో, కూలీ విడుదల మరింత ప్రత్యేకంగా మారింది.ఇటీవల, ఈ సినిమా విశేషాలు కంటే ఓ కంపెనీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. UNO Aqua Care అనే సంస్థ ఆగస్ట్ 14న కంపెనీకి సెలవు ప్రకటించింది. ఇందుకు కారణం ఆ రోజు తమ ఉద్యోగులు రజనీకాంత్ సినిమా ‘కూలీ’ని ప్రశాంతంగా చూడాలనే ఉద్దేశమని తెలియజేసింది.
ఈ మేరకు కంపెనీ విడుదల చేసిన నోటీసు వైరల్ అవుతోంది. అందులో, సూపర్ స్టార్ రజనీ సినిమా ‘కూలీ’ విడుదల సందర్భంగా, HR విభాగానికి సెలవు అభ్యర్థనలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున, ఆగస్ట్ 14న సెలవు ప్రకటిస్తున్నాం. పైరసీ వ్యతిరేకంగా మద్దతు తెలుపుతూ, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహారం అందించడం, ప్రజలకు స్వీట్లు పంచడం, ఉద్యోగులకు ఉచిత టికెట్లు అందించడం వంటి కార్యకలాపాల ద్వారా రజనీయిజం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం,” అని పేర్కొంది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మట్టుతవాని, అరపాలయం తదితర శాఖలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది.
ఇక సినిమా విషయానికొస్తే, కూలీ ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 5.55 కోట్లు వసూలు చేసింది (బ్లాక్ సీట్లు మినహా). బ్లాక్ సీట్లు కలుపుకుంటే, ఈ మొత్తము రూ. 10.27 కోట్లకు పెరిగింది. ఓవర్సీస్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 37 కోట్లకు పైగా చేరుకున్నాయి. దీంతో, ఫస్ట్ డే వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల మార్క్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ మైలురాయిగా నిలవనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, యాక్షన్, డ్రామా, అభిమానులకు సేవ చేసే మాస్ సన్నివేశాలతో నిండిన చిత్రం అవుతుందని భావిస్తున్నారు. రజినీకాంత్ తనదైన శైలిలో మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు.