OG Movie Contempt Of Court | పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. టికెట్ ధరలను సాధారణ రేట్లకే విక్రయించాలని న్యాయస్థానం ఆదేశించింది.
అయితే కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన టికెట్ రేట్లు తగ్గలేదని నెటిజన్లు సోషల్ మీడియాలు సందేశాలు పెడుతున్నారు. ప్రముఖ బుకింగ్స్ వెబ్ సైట్స్ బుక్ మై షోతో పాటు, డిస్ట్రిక్ట్ యాప్‌లలో పెంచిన ధరలే ప్రస్తుతం కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంపై బుక్ మై షోతో డిస్ట్రిక్ట్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ ఉన్నందున, 18 ఏళ్ల లోపు వారిని థియేటర్లలోకి అనుమతించకుండా చూడాలని కూడా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసింది.