Veta Movie | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన గ్రామీణ నేపథ్యంలో చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో సందీప్ సరోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వేట’. ఎస్ఆర్డి ప్రొడక్షన్స్ మరియు ఈటీవీ విన్ (ETV Win) సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం (ఆగస్ట్ 31) రోజున హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. మెగా కుటుంబం నుంచి కొణిదెల నాగబాబు, ప్రముఖ అగ్ర దర్శకుడు కేఎస్ రవికుమార్, సక్సెస్ఫుల్ డైరెక్టర్లు వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత నివాస వాతావరణంలో జరిగిన ఈ ముహూర్తపు వేడుకలో.. నాగబాబు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేయగా, కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. అలాగే సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, నిర్మాత ఫణి అడపాక సంయుక్తంగా కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ, ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తనకు ప్రేక్షకులు గొప్ప గుర్తింపునిచ్చారని, ఇప్పుడు ‘వేట’ లాంటి మంచి కథతో వస్తున్నానని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ హిట్ టైటిల్ అయిన ‘వేట’ను తమ సినిమాకు పెట్టడం చాలా సంతోషంగా ఉందని, ఈ కథకు ఈ టైటిల్ నూటికి నూరు శాతం సరిపోతుందని అన్నారు.
ఈ చిత్రంలో ఒక కీలకమైన మరియు బలమైన పాత్రలో నటిస్తున్న ప్రముఖ దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ, దర్శకుడు అశోక్ కోటిపల్లి ఫోన్లో కథ చెప్పినప్పుడే తనకు విపరీతంగా నచ్చిందన్నారు. ఈ చిత్రంలో ఊర్లో పెదరాయుడు తరహాలో ఉండే ఒక పవర్ఫుల్ పాత్రను తాను పోషిస్తున్నానని, ఈ జనరేషన్ ఆడియెన్స్‌కి నర్చే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ, ఇది తన మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాతలు మరియు ఈటీవీ విన్ టీమ్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కేఎస్ రవికుమార్ లాంటి దిగ్గజం తన తొలి సినిమాలోనే నటించడానికి వెంటనే అంగీకరించడం తన అదృష్టమని పేర్కొన్నారు.
నిర్మాతలు ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక మాట్లాడుతూ, ఈటీవీ విన్‌తో కలిసి తాము చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదని చెప్పారు. ‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలోనే పల్లెటూరి వాతావరణం, సహజత్వంతో కూడిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సరిగ్గా సరిపోతాయని తెలిపారు. హీరోయిన్ సాత్విక జంపా మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ కోటిపల్లి; నిర్మాతలు: ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక; బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & ఈటివి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్; సంగీతం: చైతన్ భరద్వాజ; సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్; ఎడిటర్: రాఘవేంద్ర తిరుణ్; ఫైట్స్: ఏ. విజయ్.
ఈ చిత్రంలో సందీప్ సరోజ్ సరసన సాత్విక జంపా హీరోయిన్గా నటిస్తుండగా.. కే.ఎస్. రవికుమార్, రాజీవ్ కనకాల, రఘు బాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ విభిన్న కథా చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది.