గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది ‘కమిటీ కుర్రోళ్లు’. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మించారు. తాజా సమాచారం ప్రకారం ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 25కోట్లు వసూలు చేసింది. సైమా, గద్దర్ అవార్డుల్లో సత్తాచాటింది. ఇదిలా ఉండగా నిహారిక కొణిదెల తన బ్యానర్లో నిర్మిస్తున్న రెండో చిత్రంలో సంగీత్ శోభన్, నయన్సారిక జంటగా నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.