Comedian | సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖుల జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. సంపాదించింది అంతా జాగ్రత్త లేకుండా ఖర్చు చేసి చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సావిత్రి లాంటి మహానటి కూడా జాగ్రత్త పడకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో మనం చూశాం. అయితే ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పంచిన ప్రముఖ కమెడియన్ రామచంద్ర ఇప్పడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇటీవల ప్రముఖ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాటిక్ ప్రయాణం, ఎదురైన సమస్యలు, తన పోరాటాల గురించి ఓపెన్‌గా మాట్లాడాడు.
“ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు 25 ఏళ్లు అవుతోంది. ‘నిన్ను చూడాలని’ సినిమాతో తొలి అవకాశాన్ని అందుకున్నాను. తర్వాత ‘ఆనందం’, ‘వెంకీ’ వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి,” అని గుర్తు చేసుకున్నాడు. అయితే కెరీర్లో వచ్చిన బ్రేక్ తన జీవితాన్ని గందరగోళానికి గురిచేసిందట. ప్రారంభంలో అవకాశాలు తేలికగా వచ్చాయి. కానీ తర్వాత ఆ అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. సంపాదించిన డబ్బులతో ఓ బిజినెస్ ప్రారంభించాను… కానీ ఆ డబ్బులు అన్నీ పోయాయి. తర్వాత రోడ్డు ప్రమాదం కూడా జరిగింది. దాని వల్ల మూడేళ్లు సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ విరామం ఆయన ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుదించేలా చేసిందని, అప్పుల ఊబిలో పడేసిందని అన్నాడు.
ఎందులోనూ నిలబడలేక పోయాను. డబ్బులు పోయాయి. అప్పులు చేసాను. కొంత మేరకు తీర్చాను కానీ ఇంకా తీర్చాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు… అవకాశాలే రావడం లేదు. నిర్మాతల వద్దకు వెళ్తే, ఎవరు నువ్వు, ముఖం గుర్తులేదు! అని అంటున్నారు. ఈ మాటలు వినడం చాలా బాధగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రస్తుతం జాలి, దయ కోసం ఎదురు చూడడం లేదు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని, తన ప్రతిభకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్మాతలని విజ్ఞప్తి చేశాడు. తనలాంటి నటులు జీవితంలో నిలబడాలి అంటే మేకర్స్ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని, తమ ప్రతిభ చూపుతామని అంటున్నారు.