Dhandoraa Movie | నేషనల్ అవార్డ్ విన్నర్ ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని తాజాగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ప్రేమికుడు ప్రేయసిని ముద్దు పెట్టుకుంటానని అనడం, దానికి ఆమె రివర్స్ అవ్వడం వంటి సన్నివేశాలు కామెడీ టచ్‌తో మొదలయ్యింది టీజర్. నటుడు నవదీప్ ఈ చిత్రంలో సర్పంచ్ పాత్రలో కనిపించబోతున్నాడు. కూలింగ్ గ్లాసెస్‌లో దర్బంగా ఉన్న ఆయన, “మేం తంతే లేవనోళ్లు.. అయినొచ్చి గొకితే లేస్తరని ఎందివయా ఇది” అని వెటకారంగా పలికే తెలంగాణ యాస డైలాగ్ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటుడు శివాజీ కనిపించారు. “హైదరాబాద్ పో.. అమెరికా పో.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె” అనే ఆయన చెప్పే డైలాగ్ గ్రామీణ ఆచారాలను సూచించింది. నటుడు నందుతో పాటు, నటి బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించి షాకిచ్చింది. “ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్లు డబ్బులిస్తున్నారు..నేను వాళ్లకి సర్వీస్ చేస్తున్నాను” అంటూ ఆమె చెప్పిన డైలాగ్ బోల్డ్‌గా ఉంది. శవాన్ని మోసుకెళ్లే దృశ్యం, “నాలుగు పుస్తకాలు చదివి.. లోకమంతా తెలిసినట్లు మాట్లాడొద్దు.. నీకు తెలియని లోకం ఇంకోటుందిరా” అంటూ శివాజీ చెప్పే సంభాషణలు కథలో లోతైన తాత్వికత, భావోద్వేగాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.
ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక బలమైన సామాజిక స్పృహను కలిగించే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అగ్ర వర్ణాలకు చెందిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, లేదా వారి దౌర్జన్యాలకు ఎదురు తిరిగినా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే అంశాన్ని కథా వస్తువుగా తీసుకున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను వ్యంగ్యం, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల సమ్మేళనంగా దర్శకుడు ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
సాంకేతిక నిపుణులు:
విభాగం పేరు
బ్యానర్ లౌక్య ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం మురళీకాంత్
సంగీతం మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫీ వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్ సృజన అడుసుమిల్లి
ఆడియో T-సిరీస్
ఓవర్సీస్ రిలీజ్ అథర్వణ భద్రకాళి పిక్చర్స్