Prem Rakhsith | అంతర్జాతీయ వేదికలపై ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ అవార్డు ఈ పాటకు రావడంపై ఇండియన్ సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై స్పందించాడు.
నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచిన విషయం తెలిసాక కొద్ది క్షణాలు తనకేమి అర్థం కాలేదని ప్రేమ్ రక్షిత్ తెలిపాడు. వాష్ రూమ్‌లోకి వెళ్లి ఆనందంతో గంటన్నరపాటు ఏడ్చానని చెప్పాడు. అంతేకాకుండా తారక్, చరణ్ ఇద్దరూ మంచి డ్యాన్సర్లని, వారికి మంచి స్టెప్స్ డిజైన్ చేయడానికి తనకు రెండు నెలల సమయం పట్టిందని వెల్లడించాడు. ఈ పాట కోసం దాదాపు 20 రోజుల పాటు రిహార్సల్స్ చేశామని చెప్పుకొచ్చాడు.
‘నాటు నాటు’ పాట ఈ స్థాయికి రావడనికి కాస్ట్ అండ్ క్రూ ఎంతో కష్టపడినట్లు ప్రేమ్ రక్షిత్ చెప్పింది చూస్తే తెలుస్తుంది. కీరవాణి స్వర పరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్‌లు ఆలపించారు. తాజాగా ఈ పాట క్రిటిక్ చాయిస్ అవార్డులో ది బెస్ట్ సాంగ్గానూ అవార్డు అందుకుంది. ఇక నాటు నాటు పాట ఆస్కార్‌కు కూడా షార్ట్‌లిస్ట్ అయింది.