ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్రాలయం స్టూడియోస్ ‘రామం’ పేరుతో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టింది. వేణు దోనేపూడి నిర్మాత. లోకమాన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఓ యువహీరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘శ్రీరాముడి ఆదర్శాలు, ధీరత్వం గురించి నేటి తరానికి తెలియజెప్పే కథాంశమిది. ఇండియన్ స్క్రీన్ప్లే ఇప్పటివరకు ఈ తరహా కథ రాలేదు. అంతర్జాతీయ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. వివిధ భాషల్లోని అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కానున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు.